

ఈ నెల మొదటి వారంలో మరో తేజస్ యుద్ధ విమానం ప్రమాదానికి గురైనట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. సాంకేతిక సమస్య కారణంగానే ఈ ఘటన జరిగిందని ప్రాథమిక సమాచారం. పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకోవడానికి భారతీయ వాయుసేన తేజస్ జెట్స్‌ను తాత్కాలికంగా పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. తనిఖీల కోసం మొత్తం 30 సింగిల్ సీట్ జెట్స్ కార్యకలాపాలను నిలిపివేసినట్టు సమాచారం.
జాతీయ మీడియా నివేదికల ప్రకారం, ఒక కీలక వాయుసేన స్థావరంలో శిక్షణ కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పైలట్ సురక్షితంగా బయటపడినట్టు తెలిసింది. సాంకేతిక లోపమే కారణమై ఉండొచ్చని సంబంధిత వర్గాలు ప్రాథమిక అంచనాకు వచ్చాయి. పూర్తి స్థాయి తనిఖీల కోసం జెట్స్‌ను నిలిపివేశారు.
వాయుసేనలో తేజస్ ప్రవేశించిన తరువాత ఇది మూడో ప్రమాదమని అధికారులు చెబుతున్నారు. 2024లో రాజస్థాన్‌లోని జైసల్మేర్ వద్ద యుద్ధ విన్యాసాల సమయంలో ఒక తేజస్ జెట్ క్రాష్ అయింది, కానీ పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. గతేడాది నవంబర్‌లో జరిగిన దుబాయ్ ఎయిర్‌షోలో మరో యుద్ధ విమానం కూలిపోవడంతో పైలట్ ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్న సమయంలోనే తాజా ప్రమాదం జరగడం గమనార్హం.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!