

సంక్రాంతి సినిమాలంటే అనిల్ రావిపూడి గుర్తొస్తున్న ఈ రోజుల్లో, ఒకప్పుడు పండగ సీజన్‌లో విజయాలు అందుకున్న దర్శకుడు కళ్యాణ్ కృష్ణ మాత్రం కొత్త సినిమా లేకుండా ఎదురుచూస్తున్నారు. 2016లో సోగ్గాడే చిన్నినాయనా చిత్రంతో దర్శకుడిగా పరిచయమై భారీ విజయాన్ని అందుకున్నారు. తర్వాత నాగచైతన్యతో రారండోయ్ వేడుక చూద్దాం తెరకెక్కించి భావోద్వేగాలను చక్కగా చూపించగలనని నిరూపించారు. అయితే రవితేజతో చేసిన నేల టికెట్ పరాజయం ఆయన కెరీర్‌పై ప్రభావం చూపింది. కరోనా పరిస్థితులు కూడా విరామాన్ని పెంచాయి. 2022లో నాగార్జున, చైతూ కలయికలో బంగార్రాజు తీసి మరోసారి సంక్రాంతి బరిలో విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇలా నాలుగు సినిమాల్లో మూడు విజయాలు అందుకున్నప్పటికీ, ఆ తర్వాత ఆయన నుంచి కొత్త చిత్రం రాలేదు.
బంగార్రాజు విడుదలై నాలుగేళ్లు దాటినా కళ్యాణ్ కృష్ణ తదుపరి సినిమా ప్రారంభం కాకపోవడం చర్చనీయాంశమైంది. 2023లో మెగాస్టార్ చిరంజీవితో సినిమా దాదాపు ఖాయమైందనే ప్రచారం జరిగింది. కథా చర్చలు జరిగినా ఆ ప్రయత్నం కార్యరూపం దాల్చలేదు. అనంతరం నాగార్జున, చైతన్య, అఖిల్‌తో భారీ అక్కినేని మల్టీస్టారర్ రూపొందించనున్నారనే వార్తలూ వినిపించాయి. అదీ ముందుకు సాగలేదు. ఇప్పుడు చిరంజీవి తర్వాతి చిత్రాల విషయంలో మరోసారి కళ్యాణ్ కృష్ణ పేరు వినిపిస్తోంది. బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న చిరు, అనంతరం శ్రీకాంత్ ఓదెలతో పనిచేయాల్సి ఉంది. ఆ చిత్రం ఆలస్యమైతే బుచ్చిబాబు లేదా కళ్యాణ్ కృష్ణకు అవకాశం రావచ్చనే ప్రచారం జరుగుతోంది. అక్కినేని హీరోలతో ఎక్కువగా సినిమాలు చేసిన ఆయనకు చిరంజీవి అవకాశం దక్కితే కెరీర్‌లో కీలక మలుపు అవుతుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!