
.jpeg&w=3840&q=75)
సంక్రాంతి కానుకగా ఈ రోజు 14న థియేటర్లలో విడుదలైన స్టార్ ఎంటర్టైనర్ నవీన్ పొలిశెట్టి నటించిన చిత్రం ‘అనగనగా ఒక రాజు’ ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో సంచలన విజయాన్ని సాధించింది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రానికి నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహించగా, మీనాక్షి చౌదరి కథానాయికగా నటించారు.
వినోదంతో పాటు భావోద్వేగాలను మేళవించిన ఈ చిత్రం సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. ఈ సందర్భంగా హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఘనంగా విజయోత్సవ వేడుక నిర్వహించారు. విజయోత్సవ వేడుకలో పాల్గొన్న ప్రముఖ నిర్మాత, టీఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు మాట్లాడుతూ, “కష్టానికి తగిన ప్రతిఫలం ఈ చిత్రం. నవీన్ సినిమా కోసం ప్రాణం పెడతాడు. ఈ విజయంలో అతడి కష్టం స్పష్టంగా కనిపిస్తుంది” అన్నారు. ప్రముఖ దర్శకుడు బాబీ కొల్లి మాట్లాడుతూ, “టైమింగ్‌తో హీరో అయినవాడు నవీన్. ఒక్క ఫ్రేమ్‌లోనూ ఎనర్జీ తగ్గలేదు. మెగాస్టార్ చిరంజీవి గారు కూడా నవీన్ నటనను మెచ్చుకున్నారు” అని తెలిపారు. ఈ సందర్భంగా చిత్ర బృందం, పంపిణీదారులు, ఎగ్జిబిటర్లకు జ్ఞాపికలు అందజేశారు.
నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ, “ఈ సంక్రాంతి ఏడు తరాలు అటు, ఏడు తరాలు ఇటు గుర్తుండిపోతుంది. ఇంతటి పోటీలో కూడా మా సినిమా నిలబడి విజయం సాధించడానికి కారణం ప్రేక్షకులే. మీరు లేకపోతే నేను లేను” అంటూ కృతజ్ఞతలు తెలిపారు. మంచి సినిమా చేయాలనే ఉద్దేశంతోనే సమయం తీసుకుంటానని, కష్టపడితే ఫలితం తప్పకుండా ఉంటుందని ఈ చిత్రం ద్వారా చెప్పామన్నారు. కథానాయిక మీనాక్షి చౌదరి, నిర్మాత నాగవంశీ, దర్శకుడు మారి, రచయిత్రి చిన్మయి, గీత రచయిత చంద్రబోస్ తదితరులు ప్రేక్షకులకు, చిత్ర బృందానికి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రముఖ యాంకర్ సుమ కనకాల వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ వేడుక ఆహ్లాదకరంగా సాగింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!