

పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్) ప్రక్రియపై ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్ర విమర్శలు చేశారు. ఈ ప్రక్రియకు బెంగాల్ బలిపశువుగా మారిందని, రాష్ట్రంలో కోటికిపైగా ఓట్లను తొలగించారని ఆరోపించారు. ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ను బీజేపీకి ‘స్పెషల్ ఇంటెన్సివ్ రిలీఫ్’గా మార్చేశారని విమర్శించారు. అధికార పార్టీకి లబ్ధి చేకూర్చేలా ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేశారని ఆరోపించిన ఆమె, తమ పార్టీ ఎన్నికల్లో ఓడిపోలేదని, ఉద్దేశపూర్వకంగా ఓడించారని వ్యాఖ్యానించారు. ఓట్ల తొలగింపు వెనుక ఉన్నవారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు.
ఈ వ్యవహారానికి బాధ్యులైనవారిపై రాజకీయంగా ప్రతీకారం తీర్చుకుంటామని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను ఉద్దేశించి ‘వానిష్ కుమార్’ అంటూ విమర్శలు గుప్పించారు. ఈ వ్యవహారంలో తీవ్ర తప్పిదాలకు పాల్పడినవారు పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. సర్ ప్రక్రియ, ఓటర్ల జాబితాల నుంచి పేర్ల తొలగింపుపై తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య రాజకీయ విమర్శలు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో మమత వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!