

మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ చిత్రంలో మైనర్ బాలికతో షూటింగ్ నిర్వహించడంతో పాటు ప్రమోషనల్ కార్యక్రమాల్లోనూ పాల్గొనడంపై తెలంగాణ కార్మిక శాఖ రంగంలోకి దిగింది. బాల కార్మిక చట్టాలు, సంబంధిత నిబంధనలు పాటించారా లేదా అనే అంశంపై వివరణ ఇవ్వాలని నిర్మాతలకు నోటీసులు జారీ చేసింది. జై లోక్‌సత్తా సోషల్ జస్టిస్ ఫోరం చేసిన ఫిర్యాదు మేరకు కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. షూటింగ్‌లో మైనర్ బాలికను భాగం చేయడానికి జిల్లా మేజిస్ట్రేట్ నుంచి ముందస్తు అనుమతి తీసుకున్నారా? తల్లిదండ్రుల సమ్మతి పొందారా? అనే వివరాలను అధికారులు కోరారు.
అంతేకాకుండా బాలిక కాల్‌షీట్లు, హాజరు రికార్డులు, షూటింగ్‌లో పాల్గొన్న పని గంటల వివరాలను సమర్పించాలని ఆదేశించారు. షూటింగ్ వల్ల ఆమె చదువుకు ఆటంకం కలగకుండా తీసుకున్న చర్యలు, భద్రత, సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బాధ్యుడి వివరాలను కూడా అడిగారు. బాలికకు చెల్లించిన పారితోషికంలో కనీసం 20 శాతాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్‌గా జమ చేశారా అనే అంశంపైనా వివరణ కోరారు. సినిమా షూటింగ్‌తో పాటు ప్రమోషన్లు, ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఆమె పాల్గొన్న తీరుపై కూడా అధికారులు ప్రశ్నలు సంధించారు. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో నవంబర్ 4న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని నిర్మాతలను ఆదేశించారు. ఆగస్టు 21న విడుదలైన ‘ఇరుముడి’ మంచి ప్రేక్షకాదరణతో పాటు వసూళ్లు సాధించినట్లు సమాచారం. సినిమా విజయానంతరం ఇప్పుడు బాలల హక్కులు, విద్య, భద్రతకు సంబంధించిన నిబంధనల అమలుపై విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!