

కోలీవుడ్ స్టార్ సూర్య, ‘ఆవేశం’ ఫేమ్ దర్శకుడు జితు మాధవన్ తొలిసారి కలిసి చేస్తున్న చిత్రం ‘సీన్’. సూర్య కెరీర్‌లో ఇది 47వ చిత్రంగా తెరకెక్కుతోంది. తాజాగా విడుదలైన టైటిల్ గ్లింప్స్‌లో సూర్య డీఎస్పీ ప్రేమ్‌రాజ్ అనే పోలీస్ అధికారిగా పరిచయమయ్యారు. అయితే ఈ పాత్ర సాధారణ పోలీస్ క్యారెక్టర్‌కు భిన్నంగా కనిపిస్తోంది. ఆయన అలవాట్లు, మాట తీరు, ప్రవర్తనను ప్రత్యేకంగా చూపించారు. కానిస్టేబుల్ భుజంపై చేయి వేసుకుని సూర్య నడిచే విధానం, అనంతరం ఆయన ఇచ్చే వార్నింగ్ గ్లింప్స్‌లో ఆకట్టుకున్నాయి. సూర్య హావభావాలు, బాడీ లాంగ్వేజ్ పాత్రపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. గ్లింప్స్‌ను చూస్తే జితు మాధవన్ తనదైన శైలిలో యాక్షన్, కామెడీ అంశాలను మేళవించినట్లు తెలుస్తోంది.
సూర్య సరసన నజ్రియా కథానాయికగా నటిస్తుండగా, నస్లెన్, ఆనంద్ రాజ్, లాల్, రాజ్ ప్రియన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వినీత్ అగస్టిన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, సుషిన్ శ్యామ్ సంగీతం సమకూరుస్తున్నారు. జ్యోతిక, సూర్యలకు చెందిన ఝగారం స్టూడియోస్, 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీపావళి కానుకగా 2026 నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే ‘50 డేస్ టు గో’ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ‘కరుప్పు’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తర్వాత సూర్య చేస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. జితు మాధవన్ శైలిలో సూర్యను చూడటం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!