

భారతదేశంలో తొలి బుల్లెట్ ట్రైన్‌ను ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్ కోసం అభివృద్ధి చేస్తున్నారు. బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (బీఈఎంఎల్) తయారీ కేంద్రంలో ఈ రైలు నిర్మాణం కొనసాగుతోంది. భారత వాతావరణ పరిస్థితులు, ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా దీనిని రూపొందిస్తున్నారు. మొత్తం 202 మీటర్ల పొడవు ఉండే ఈ రైలులో ఎనిమిది కోచ్‌లు ఉంటాయి. నాలుగు మోటార్ కార్లు, నాలుగు ట్రైలర్ కార్లతో నిర్మించే ఈ రైలులో 557 మంది ప్రయాణించవచ్చు. వీరిలో దివ్యాంగుల కోసం రెండు ప్రత్యేక సీట్లు కేటాయించారు. ఈ రైలు గరిష్ఠంగా గంటకు 280 కిలోమీటర్ల పరీక్ష వేగాన్ని చేరుకోగలదు. సాధారణ కార్యకలాపాల్లో గంటకు 249 కిలోమీటర్ల వేగంతో నడిపేలా ప్రణాళిక రూపొందించారు. ఇందులో ఏడు స్టాండర్డ్ క్లాస్ కోచ్‌లు, ఒక ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్ ఉంటాయి.
స్టాండర్డ్ క్లాస్‌లో 3×2, ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో 2×2 సీటింగ్ విధానం అందుబాటులో ఉంటుంది. విశాలమైన కిటికీలు, వ్యక్తిగత ఛార్జింగ్ పాయింట్లు, లగేజ్ ర్యాక్‌లు, ఎల్‌ఈడీ లైటింగ్, సమాచార స్క్రీన్లు, వై-ఫై ఆధారిత వినోద వ్యవస్థ వంటి సౌకర్యాలు కల్పించనున్నారు. దివ్యాంగుల కోసం లెవల్ బోర్డింగ్, ప్రత్యేక టాయిలెట్లు, బ్రెయిలీ సూచికలు, అత్యవసర సమాచార వ్యవస్థలను ఏర్పాటు చేస్తారు. ప్రతి కోచ్‌లో ఉష్ణోగ్రత, తేమను నియంత్రించే HVAC వ్యవస్థతో పాటు శబ్దాన్ని తగ్గించే ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. 25 కేవీ ఏసీ విద్యుత్ వ్యవస్థతో నడిచే ఈ రైలులో రీజెనరేటివ్ బ్రేకింగ్ సదుపాయం ఉంటుంది. వేగం తగ్గించే సమయంలో ఉత్పత్తయ్యే శక్తిని తిరిగి విద్యుత్‌గా మార్చడం ద్వారా శక్తి ఆదా చేయవచ్చు. గాలి నిరోధకతను తగ్గించే ఏరోడైనమిక్ డిజైన్ సొరంగాల్లో ప్రయాణించే సమయంలో శబ్దం, గాలి ఒత్తిడి ప్రభావాలను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో రెండు ఎనిమిది కోచ్‌ల రైళ్లను కలిపి 16 కోచ్‌ల రైలుగా నడిపే అవకాశమూ ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!