

డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి రవాణా శాఖ కొత్త నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది. రోడ్డు భద్రతపై అభ్యర్థులకు అవగాహన పెంచే ఉద్దేశంతో రెండున్నర గంటల వీడియో పాఠాలను తప్పనిసరి చేసింది. ఇకపై లెర్నింగ్ లైసెన్స్ (LLR) పరీక్షలో ఉత్తీర్ణులైన వారు ఈ వీడియోను పూర్తిగా వీక్షించాల్సి ఉంటుంది. గతంలో ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి, రవాణా శాఖ కార్యాలయంలో కంప్యూటర్ పరీక్ష రాసి ఎల్‌ఎల్‌ఆర్ పొందేవారు. అనంతరం నిర్ణీత వ్యవధి తర్వాత శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుని డ్రైవింగ్ టెస్ట్‌కు హాజరయ్యేవారు.
కొత్త విధానం ప్రకారం ఎల్‌ఎల్‌ఆర్ పరీక్షలో పాసైన అభ్యర్థుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ప్రత్యేక లింక్ పంపిస్తారు. ఆ లింక్‌ను ఓపెన్ చేసి ఎల్‌ఎల్‌ఆర్ నంబర్, పుట్టిన తేదీ నమోదు చేయాలి. మొబైల్‌కు వచ్చే ఓటీపీతో లాగిన్ అయిన తర్వాత ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా గుర్తింపును నిర్ధారిస్తారు. అనంతరం వాహనం నడిపే విధానం, ట్రాఫిక్ నియమాలు, ప్రమాదాల నివారణ వంటి అంశాలతో కూడిన రెండున్నర గంటల వీడియోను పూర్తిగా చూడాలి. వీడియో మధ్యలో ఆపడం లేదా సూచించిన విధానాన్ని పాటించకపోవడం వల్ల ప్రక్రియ నిలిచిపోయే అవకాశం ఉంది. వీడియోను విజయవంతంగా పూర్తిచేసిన తర్వాత స్క్రీన్‌పై ధ్రువపత్రం జనరేట్ అవుతుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాతే శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షకు స్లాట్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!