

తమిళనాడులోని మదురై జిల్లాలో ఉన్న తిరుప్పరన్‌కుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించే విషయంలో గత కొద్దిరోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు మంగళవారం (నవంబర్ 24) తెరపడింది. సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో ఆలయ అధికారుల అనుమతితో కొద్దిమంది అర్చకులు కొండపైకి చేరుకుని దీపథూన్ అనే రాతి స్తంభం వద్ద కార్తీక దీపాన్ని వెలిగించారు. దీంతో ఈ ఏడాది దీపోత్సవ నిర్వహణపై నెలకొన్న అనిశ్చితి తాత్కాలికంగా తొలగింది. అయితే ఈ పరిణామం తమిళనాడులో మరోసారి రాజకీయ చర్చకు దారితీసింది.
నవంబర్ 20న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో సుప్రీంకోర్టు.. నవంబర్ 24న ఆలయ యాజమాన్యం అనుమతించిన పరిమిత బృందం మాత్రమే దీపం వెలిగించేందుకు అనుమతించింది. అయితే ఈ అనుమతిని శాశ్వత సంప్రదాయానికి గుర్తింపుగా లేదా భవిష్యత్తులోనూ ఇదే విధంగా దీపం వెలిగించే హక్కుగా పరిగణించరాదని స్పష్టం చేసింది. మరోవైపు, దీపం వెలిగించే కార్యక్రమానికి వెళ్లాలని భావించిన తమిళనాడు BJP అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్‌ను పోలీసులు అడ్డుకున్నారని ఆ పార్టీ ఆరోపించగా, భద్రతా కారణాలతోనే ఆయన నివాసం వద్ద పోలీసులను మోహరించినట్లు పోలీసులు వివరణ ఇచ్చారు. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలని, నిర్బంధించిన వారిని విడుదల చేయాలని మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ అధికారులను ఆదేశించింది. కొండ పరిసరాల్లో సుమారు 5,618 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈ ఏడాది దీపం వెలిగించినప్పటికీ, ఆచారానికి సంబంధించిన ప్రధాన న్యాయ వివాదంపై తుది నిర్ణయం రావాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!