

దీపావళి పండుగ నేపథ్యంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో గ్రీన్ క్రాకర్స్ కాల్చేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. నవంబర్ 7, 8 తేదీల్లో మాత్రమే బాణసంచా కాల్చాలని స్పష్టం చేసింది. ఆ రెండు రోజుల్లోనూ ఉదయం 6 నుంచి 7 గంటల వరకు, రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చేందుకు అవకాశం కల్పించింది. ఆసుపత్రులు, నర్సింగ్ హోంలు, వృద్ధాశ్రమాలు, నోటిఫైడ్ సైలెన్స్ జోన్లకు 300 మీటర్ల పరిధిలో బాణసంచా కాల్చకూడదని అధికారులను ఆదేశించింది. ఈ అనుమతి కేవలం గ్రీన్ క్రాకర్స్‌కే పరిమితమని స్పష్టం చేసింది.
జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ పి.బి. వరాలేతో కూడిన ధర్మాసనం బేరియం కలిగిన టపాసులతో పాటు CSIR-NEERI ఆమోదం లేని గ్రీన్ క్రాకర్స్ వినియోగంపై నిషేధాన్ని పునరుద్ఘాటించింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలోకి అక్రమంగా, కాలుష్యకారక టపాసులు దిగుమతి కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. గతంలో విధించిన ఆంక్షల ప్రకారం నవంబర్ 9 నుంచి దిల్లీ-ఎన్‌సీఆర్‌లో బాణసంచాపై పూర్తి నిషేధం తిరిగి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. అక్టోబర్ 29న జారీ చేసిన ఈ ఉత్తర్వులు సోమవారం అందుబాటులోకి వచ్చాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!