

హీరో సత్యదేవ్ తన 15 వ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ సినిమాను త్రిశూల్ విజినరీ స్టూడియోస్ బ్యానర్‌పై బి. నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు లక్ష్మినారాయణ పుట్టంచెట్టి పూర్తి వినోదభరితమైన కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. హీరోయిన్గా ఫరియా అబ్దుల్లా నటిస్తోంది. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ఘనంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా హాజరై హీరో, హీరోయిన్లపై క్లాప్ ఇచ్చారు. యంగ్ ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
ఈ సందర్భంగా వంశీ నందిపాటి మాట్లాడుతూ, సత్యదేవ్ ఈ సినిమాలో పూర్తి వినోదాత్మక పాత్రలో కనిపించనున్నారని, ఈ సినిమా ఆయన కెరీర్లో పెద్ద హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దర్శకుడు లక్ష్మినారాయణ మాట్లాడుతూ, ప్రేక్షకుల ముఖాల్లో నవ్వులు పూయించే కథతో ఈ సినిమా ఉంటుందని తెలిపారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు. సంగీత దర్శకుడు రామ్ మిరియాల ఇప్పటికే రెండు పాటలను పూర్తి చేశారని, ఈ సినిమా సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపారు.

ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, వైవా హర్ష, ఎస్.ఎస్. కాంచి, సురేష్ గురు తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. పూర్తి వినోదంతో ప్రేక్షకులను అలరించడానికి ఈ సినిమా సిద్ధమవుతోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!