

యంగ్ హీరోయిన్ సంయుక్త మీనన్ ఇప్పుడు ‘అఖండ 2: ది తాండవం’ ద్వారా ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. మైథలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ జానర్లో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆమె ఫిమేల్ లీడ్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం ప్రమోషన్లతో సంయుక్త బిజీగా గడుపుతున్నారు.
బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘అఖండ’ బ్లాక్‌బస్టర్ అవ్వడంతో, దాని సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో సంయుక్త మీనన్ పాత్ర చాలా బలమైనదిగా ఉంటుందని ఇప్పటికే టీమ్ సూచించింది. ఫస్ట్ పార్ట్ సక్సెస్, ప్రమోషనల్ కంటెంట్ పై ఏర్పడిన భారీ హైప్ అన్ని కలిసి ఈ సినిమాలో సంయుక్తకు పెద్ద హిట్ దక్కుతుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇక ఈ సినిమా విజయవంతమైతే సంయుక్త అరుదైన జాబితాలో చేరే అవకాశం ఉంది. అదేంటంటే ఒకే ఫ్యామిలీకి చెందిన రెండు తరాల హీరోలతో నటించి విజయవంతమైన హీరోయిన్ల లిస్ట్. ఇప్పటికే కొంత మంది నటీమణులు ఆ జాబితాలో ఉన్నారు. ఇప్పుడు సంయుక్త కూడా చేరవచ్చని సినీ ప్రేమికులు, విశ్లేషకులు భావిస్తున్నారు.
నందమూరి కుటుంబానికి చెందిన కళ్యాణ్ రామ్‌తో సంయుక్త ఇప్పటికే రెండు సినిమాలు చేశారు 2022 లో వచ్చిన ‘బింబిసార’ భారీ విజయం సాధించగా, తర్వాత వచ్చిన ‘డెవిల్’ ఆశించినంత స్థాయిలో రాణించలేదు. ఇప్పుడు అదే కుటుంబానికి చెందిన బాలయ్యతో ‘అఖండ 2’ చేస్తున్నారు. ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధిస్తే, ఆమె క్రేజీ హీరోయిన్ల లిస్ట్‌లో చోటు దక్కడం ఖాయమని భావిస్తున్నారు.
‘అఖండ’ ఫస్ట్ పార్ట్ లో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించగా, ఇప్పుడు సీక్వెల్లో సంయుక్త నటించడం సినిమా మీద ఉన్న ఆసక్తిని మరింత పెంచింది. సంయుక్త నటనా గురించి తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు. ‘భీమ్లా నాయక్’ సినిమా ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు నచ్చిన ఆమె, ‘విరూపాక్ష’ లో తన ప్రదర్శనతో మరింత మెప్పించారు. వరుసగా మంచి అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు సాగుతున్న సంయుక్త ఇప్పుడు ‘అఖండ 2’ తో ఎలా అలరిస్తారో చూడాలి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!