

తెలంగాణలో నిరుద్యోగ యువతకు మరో 25 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. వచ్చే ఏడాది కాలంలో ఈ నియామకాలు చేపట్టి, మొత్తం లక్ష ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ లక్ష్యాన్ని పూర్తి చేస్తామని వెల్లడించారు. ఇప్పటికే 75 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు తెలిపారు. ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం ఈ ప్రకటన చేశారు. అంతకుముందు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చౌరస్తా నుంచి మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రజలతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు కోటి ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడంతో పాటు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులు తదితర అర్హులైన వర్గాలకు కొత్త చేయూత పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యంతో సాగిందని గుర్తుచేశారు. పాలమూరు ప్రాంతంలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి కృష్ణా జలాలను రైతుల పొలాలకు అందిస్తామని హామీ ఇచ్చారు. అచ్చంపేట ఎత్తిపోతల, డిండి, ఎస్‌ఎల్‌బీసీ, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, జూరాల, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. రైతులు, మహిళలు, యువత సంక్షేమానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్, రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ వంటి పథకాలను వివరించారు. మహిళా సంఘాలకు రుణాల అనుసంధానం, ఎస్సీ ఉపకులాల వర్గీకరణ, కులగణన వంటి కార్యక్రమాలను ప్రస్తావిస్తూ కుల, మత, రాజకీయ వివక్ష లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని స్పష్టం చేశారు. అచ్చంపేట, నల్లమల ప్రాంతాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!