

ప్రముఖ వ్యాపారవేత్త, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల తన ఫిట్‌నెస్ ప్రయాణం, బరువు తగ్గే క్రమంలో ఎదుర్కొన్న సవాళ్లు, తనపై వచ్చిన విమర్శల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అమెరికాలో చదువుకునే సమయంలో కుటుంబానికి దూరంగా ఉండటం వల్ల ఒత్తిడికి గురయ్యానని, ఆ సమయంలో ఎక్కువగా తినడంతో 18 ఏళ్ల వయసులో 95 కిలోల బరువు పెరిగానని తెలిపారు. ఆ తర్వాత పలువురు ఆహార నిపుణులను సంప్రదించి, వివిధ రకాల ఆహార నియమాలను పాటించినట్లు చెప్పారు. చివరికి అన్నం, గోధుమలకు బదులుగా ఓట్స్, అధిక మాంసకృత్తులు ఉన్న ఆహారం తీసుకోవడంతో మంచి ఫలితం కనిపించిందన్నారు. ప్రతిరోజూ సుమారు 10 వేల అడుగులు నడవడం కూడా అలవాటు చేసుకున్నానని తెలిపారు.
రామ్ చరణ్‌తో వివాహం జరిగిన సమయంలోనూ తన బరువుపై తీవ్ర విమర్శలు వచ్చాయని ఉపాసన చెప్పారు. తొలినాళ్లలో ఆ వ్యాఖ్యలు తనను బాధించాయని, అయితే వాటి కారణంగానే మానసికంగా మరింత దృఢంగా మారానని పేర్కొన్నారు. ప్రస్తుతం విమర్శలను ఎలా ఎదుర్కోవాలో తనకు బాగా తెలుసన్నారు. అలాగే తాను నిద్రలేమితో బాధపడుతున్నట్లు వెల్లడించిన ఉపాసన, తనకు, తన తల్లికి రోజుకు నాలుగు గంటలకు మించి నిద్ర పట్టదని చెప్పారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని త్వరలో నిద్ర సంబంధిత వైద్య కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. జీవనశైలి మార్పు పూర్తిగా మనస్తత్వంపై ఆధారపడి ఉంటుందని అన్నారు. మానసిక ప్రశాంతత కోసం చరణ్‌తో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటానని, దీపక్ చోప్రా కోర్సులు, సద్గురు జగ్గీ వాసుదేవ్ ప్రవచనాలు వింటానని చెప్పారు. చరణ్‌తో కలిసి వ్యాయామాలు చేస్తూ, కొత్త ఆహార నియమాలను పాటిస్తున్నట్లు తెలిపారు. ఈ దంపతులకు మూడేళ్ల కుమార్తె క్లీంకారతో పాటు, 2026 జనవరిలో శివరామ్, అన్వీరా దేవి అనే కవలలు జన్మించిన సంగతి తెలిసిందే.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!