

అమెరికాతో పాటు యావత్ ప్రపంచాన్ని కుదిపేసిన 9/11 ఉగ్రదాడులకు శుక్రవారంతో 25 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో అల్‌ఖైదా తాజాగా ఓ వీడియోను విడుదల చేసింది. అందులో ఆ ఉగ్రసంస్థ మాజీ అధినేత ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హమ్జా బిన్ లాడెన్ మాట్లాడుతున్న దృశ్యాలు ఉన్నట్లు తెలుస్తోంది. 2019లో అఫ్గాన్-పాక్ సరిహద్దులో అమెరికా చేపట్టిన ఉగ్రవాద నిరోధక ఆపరేషన్‌లో హమ్జా మరణించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే 2025లో వెలువడిన పలు నిఘా నివేదికలు అతడు ఇంకా బతికే ఉండొచ్చని పేర్కొన్నాయి. తాజాగా అతడి వీడియోను అల్‌ఖైదా విడుదల చేయడంతో హమ్జా ప్రాణాలతో ఉన్నాడా అనే ప్రశ్నలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఒసామా బిన్ లాడెన్ వారసుడిగా హమ్జాను చూపించే ఉద్దేశంతోనే ఈ వీడియోను విడుదల చేసి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
9/11 దాడులకు 25 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అమెరికా రాయబారి మాట్లాడుతూ, ఈ దాడులకు కారణమైన ఉగ్రవాదులను అంతర్జాతీయ సమాజం ఐక్యంగా వేటాడిందని పేర్కొన్నారు. మరోవైపు పాకిస్థాన్ ప్రతినిధి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తమ దేశం పోరాడుతోందని తెలిపారు. 2001 సెప్టెంబరు 11న అమెరికాలో అల్‌ఖైదా భీకర ఉగ్రదాడులకు పాల్పడింది. ఈ దాడులకు ప్రతీకారంగా 2011లో అమెరికా కీలక ఆపరేషన్ చేపట్టి పాకిస్థాన్‌లో దాక్కున్న ఒసామా బిన్ లాడెన్‌ను హతమార్చింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!