
.png&w=3840&q=75)
18 ఏళ్లకే ఉరికంబం ఎక్కిన ఖుదీరాం బోస్ పాత్రలో నటించడం నా జీవితంలో గొప్ప అదృష్టం అని ‘ఖుదీరాం బోస్’ మూవీ హీరో రాకేష్ జాగర్లమూడి అన్నారు. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో అతి చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన విప్లవ వీరుడు ఖుదీరాం బోస్ జీవితాన్ని ఆధారంగా తీసుకుని ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో టైటిల్ రోల్ పోషించిన రాకేష్ తన అనుభవాలను పంచుకున్నారు.
కథ విన్నప్పుడే హృదయం కదిలిపోయిందని రాకేష్ చెప్పారు. కేవలం 18 ఏళ్ల వయసులో దేశం కోసం చిరునవ్వుతో మరణాన్ని ఎదుర్కొన్న ఖుదీరాం బోస్ జీవితం తనను తీవ్రంగా ప్రభావితం చేసిందన్నారు. ఆ పాత్రను చేయబోతున్నానని తెలిసినప్పుడు గర్వంతో పాటు బాధ్యత కూడా పెరిగిందన్నారు. ఈ అవకాశం తన తండ్రి, నిర్మాత విజయ్ జాగర్లమూడి ద్వారా లభించిందని తెలిపారు. అవకాశం సులభంగా దక్కినా, పాత్రకు న్యాయం చేయడానికి తీవ్రంగా శ్రమించానన్నారు. దేశభక్తిపై అపారమైన ప్రేమ ఉన్న తన తండ్రి, నేటి తరానికి ఈ వీరుడి గాథ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సినిమాను నిర్మించారన్నారు.
ఈ పాత్ర కోసం దాదాపు 90 రోజులు కఠిన శిక్షణ తీసుకున్నట్లు రాకేష్ వెల్లడించారు. మయూఖ ఫిలిం ఇన్స్టిట్యూట్లో ఉత్తేజ్ వద్ద నటన శిక్షణ పొందానని, ఆ కాలానికి సంబంధించిన బాడీ లాంగ్వేజ్ కోసం ఫిజికల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నానన్నారు. ఖుదీరాం బోస్ గురించి తెలిసిన ఎన్నో విషయాలు తనను ఆశ్చర్యపరిచాయని చెప్పారు. ‘వందేమాతరం’ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం, సిస్టర్ నివేదితతో ఆయనకున్న అనుబంధం, తొలి భారత జెండాను ప్రజల్లోకి తీసుకెళ్లిన ఘట్టాలు తనను బాగా ప్రభావితం చేశాయన్నారు. ఉరికంబం సన్నివేశం అత్యంత భావోద్వేగపూరితమైనదిగా పేర్కొన్నారు. మరణం కళ్లముందున్నా దేశం కోసం నవ్వుతూ ప్రాణాలర్పించడం సాధారణ విషయం కాదని, ఆ సీన్ తనలో ధైర్యం, సత్యం కోసం నిలబడే మనోబలం పెంచిందన్నారు.
సీనియర్ నటులు, టెక్నీషియన్లతో కలిసి పనిచేయడం తనకు గొప్ప పాఠశాల లాంటిదని చెప్పారు. అతుల్ కులకర్ణి, వివేక్ ఓబెరాయ్, నాజర్ లాంటి దిగ్గజాలతో పని చేయడం ఎంతో నేర్పిందన్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ తనకు పెద్ద ఆదర్శమని రాకేష్ తెలిపారు. చిన్నప్పటి నుంచి ఆయనతో ఉన్న అనుబంధం, ట్రైలర్ చూసి ఆయన ఇచ్చిన ఆశీర్వాదం తనకు ఎంతో బలాన్నిచ్చిందన్నారు. పార్లమెంట్ స్క్రీనింగ్, గోవా ఫిలిం ఫెస్టివల్లో సినిమాకు అద్భుత స్పందన లభించిందన్నారు. ప్రేక్షకులు స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వడం తనకు ఎంతో గర్వంగా అనిపించిందన్నారు.
దేశభక్తి మాటల్లో కాదు, పనుల్లో కనిపించాలన్నదే తన సందేశమని చెప్పారు. ‘ఖుదీరాం బోస్’ లాంటి సినిమాలు మన చరిత్రను గుర్తు చేసే అరుదైన ప్రయత్నాలని పేర్కొన్నారు. ఈ చిత్రం భారత ప్రభుత్వ అధికారిక ఓటీటీ ‘Waves’ లో ఉచితంగా అందుబాటులో ఉందని తెలిపారు. తెలుగు, హిందీ, తమిళం, బెంగాలీ భాషల్లో ఎటువంటి సబ్స్క్రిప్షన్ లేకుండా చూడవచ్చన్నారు. భవిష్యత్తులో ఛత్రపతి శివాజీ వంటి వీరగాథల్లో నటించాలని తన ఆకాంక్షను వెల్లడించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!