

బాలీవుడ్ నటుడు రాజ్‌పాల్ యాదవ్ చెక్ బౌన్స్ కేసులో ఇటీవల తిహార్ జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే తాను జైలుకు వెళ్లడానికి కేవలం డబ్బు చెల్లించకపోవడమే కారణం కాదని ఆయన తాజాగా వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో ఈ అంశంపై స్పందించిన రాజ్‌పాల్ యాదవ్, ఈ వివాదం వెనుక మరిన్ని కారణాలు ఉన్నాయని చెప్పారు.
‘‘నేను ఎంతోమందికి సహాయం చేశాను. కానీ వాటి గురించి ఎప్పుడూ ఎక్కడా చెప్పుకోలేదు. గత 25 ఏళ్లుగా మా గ్రామం నుంచి ముంబయి వరకు చాలా మంది నాకు అండగా నిలిచారు. నా కెరీర్ ఇంతకాలం విజయవంతంగా సాగడమే దానికి నిదర్శనం. నేను 250కి పైగా సినిమాల్లో నటించాను. పరిశ్రమ మద్దతు లేకుండా అది సాధ్యమయ్యేది కాదు. ఇండస్ట్రీలో ఇన్నేళ్లు ఉన్న నాకు రూ.5 కోట్లు చెల్లించడం పెద్ద విషయం కాదు. కేవలం ఆ డబ్బు చెల్లించకపోవడం వల్లనే నేను జైలుకు వెళ్లానని చెప్పడం సరైంది కాదు. అదే కారణమైతే ఈ విషయం 2012లోనే ముగిసిపోయేది’’ అని అన్నారు.
వివాదం ఎలా మొదలైందనే ప్రశ్నకు స్పందిస్తూ, ‘‘ఒక సినిమా కోసం ఇప్పటికే రూ.12 కోట్లు ఖర్చు చేశాం. అయితే తర్వాత బడ్జెట్ రూ.22 కోట్లకు పెరిగింది. అక్కడి నుంచే సమస్యలు ప్రారంభమయ్యాయి. ఏ వ్యాపారంలోనైనా నష్టాలు సహజమే. సినిమా రంగంలో 100 సినిమాల్లో 20 మాత్రమే విజయవంతమవుతాయి. మిగతావి విఫలమవుతాయి. ఒక సినిమాకు ప్రేక్షకాదరణ రాకపోయిందని అందులో మోసం జరిగిందని అనుకోవడం సరైంది కాదు. నాకు న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది. ఈ పోరాటాన్ని నేను మొదలుపెట్టలేదు.. కానీ ముగింపు మాత్రం నేనే ఇస్తాను’’ అని రాజ్‌పాల్ యాదవ్ పేర్కొన్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!