

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తన కొత్త చిత్రం ‘వారణాసి’ ప్రచార కార్యక్రమాలతో అంతర్జాతీయ వేదికలపై సందడి చేస్తున్నారు. మహేష్ బాబు ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రంపై విదేశాల్లో ఇప్పటికే ఆసక్తి నెలకొంది. తాజాగా ఫ్రాన్స్‌లో జరిగిన ఓ ప్రత్యేక ఇంటరాక్షన్‌లో పాల్గొన్న రాజమౌళి, తన సినీ ప్రయాణంలో ఎదురైన ఆసక్తికర అనుభవాలను పంచుకున్నారు. ఒక దర్శకుడిగా కథలో భావోద్వేగాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తానని పేర్కొంటూ, కొన్ని సందర్భాల్లో ఆ నిర్ణయాలపై తన కుటుంబ సభ్యులు, చిత్రబృందంతో అభిప్రాయ భేదాలు కూడా ఏర్పడతాయని వెల్లడించారు. కథకు అవసరమైన బలం కోసం తీసుకునే నిర్ణయాలే చివరికి సినిమాకు ప్రత్యేకతను తీసుకొస్తాయని ఆయన వివరించారు.
ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కించిన ‘సింహాద్రి’ చిత్రాన్ని ఉదాహరణగా ప్రస్తావించారు. ఆ సినిమాలో హీరో ఒక మంచి వ్యక్తిని చంపాల్సిన పరిస్థితి రావడం వెనుక ఉన్న భావోద్వేగాన్ని తెరపై చూపించడంపై తమ మధ్య విస్తృత చర్చ జరిగిందన్నారు. ఆ పాత్రను చంపకపోతే వేలాది మంది అమాయకుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయనే పరిస్థితిని బలంగా చూపించాల్సిందేనని తాను పట్టుదలగా నిలిచినట్లు చెప్పారు. చివరకు ఆ సన్నివేశాన్ని అలాగే చిత్రీకరించడంతో కథకు మరింత బలం చేకూరిందని, ప్రేక్షకుల ఆదరణతో సినిమా ఘన విజయాన్ని అందుకుందని రాజమౌళి గుర్తుచేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారాయి.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!