

రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తీసుకున్న తాజా నిర్ణయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఆమె ఇప్పుడు అక్కడ దాఖలు చేసిన ప్రత్యేక అనుమతి పిటిషన్‌ను ఉపసంహరించుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో కేసు విచారణ మళ్లీ దిగువ కోర్టులోనే కొనసాగనుంది. ఈ పరిణామం వెనుక జాక్వెలిన్ న్యాయ వ్యూహంలో మార్పు కనిపిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేసును నేరుగా ట్రయల్ కోర్టులో ఎదుర్కొంటూ తన వాదనను బలంగా వినిపించాలని ఆమె నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారం మరోసారి సినీ, న్యాయ వర్గాల్లో చర్చకు దారితీసింది.
ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం కింద నమోదైన ఈ కేసులో సుకేష్ చంద్రశేఖర్ నుంచి విలువైన బహుమతులు స్వీకరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న జాక్వెలిన్ మొదటి నుంచీ తనకు నిజమైన విషయాలు తెలియవని, తాను మోసపోయానని చెబుతున్నారు. ఇదే కేసులో అప్రూవర్‌గా మారేందుకు గతంలో చేసిన దరఖాస్తును కూడా ఆమె వెనక్కి తీసుకోవడం ఆసక్తి రేపుతోంది. ఇప్పుడు పాటియాలా హౌస్ కోర్టులో విచారణ కొనసాగనున్న నేపథ్యంలో అక్కడ తన వాదనలతో నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేయనున్నారు. ఈ కేసు తదుపరి విచారణలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!