

నటి కత్రినా కైఫ్ ఇటీవల తన శరీరాకృతిపై సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలపై పరోక్షంగా స్పందించారు. తన బ్యూటీ బ్రాండ్ ‘కే బ్యూటీ’ యూకేలో ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా లండన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. సోషల్ మీడియాలో వచ్చే విమర్శలు తమ ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసాన్ని ప్రభావితం చేయకుండా జాగ్రత్తపడాలని సూచించారు. ప్రతి ఒక్కరి అభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకోవాలని ప్రయత్నిస్తే సరైన నిర్ణయాలు తీసుకోలేమని పేర్కొన్నారు. ప్రపంచం ప్రశంసించే సందర్భాలతో పాటు, మనకు మనమే ప్రోత్సాహం ఇచ్చుకోవాల్సిన సందర్భాలు కూడా ఉంటాయని, అలాంటప్పుడు మనకు మనమే అభిమానిగా మారాలని కత్రినా అన్నారు.
ఇటీవల భర్త విక్కీ కౌశల్‌తో కలిసి అంబానీ కుటుంబం నిర్వహించిన వినాయక చవితి వేడుకలకు కత్రినా హాజరయ్యారు. ఆ వేడుకలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రసవానంతరం ఆమె బరువు పెరిగారంటూ కొందరు విమర్శలు చేయడంతో పలువురు సినీ ప్రముఖులు స్పందించి కత్రినాకు మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!