

టాలీవుడ్ నటుడు నాగ చైతన్య, నటి శోభిత ధూళిపాళ 2024 డిసెంబరులో వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శోభిత తన వైవాహిక జీవితం, కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పెళ్లైన తొలి ఏడాది ఇద్దరూ తమ కెరీర్‌లతో ఎంతో బిజీగా గడిపామని చెప్పారు. వివాహమైన కొద్ది వారాలకే తాను షూటింగ్ కోసం తమిళనాడు వెళ్లి 150 రోజులకు పైగా అక్కడే ఉన్నానని, ఆ సమయంలో నెలకు ఒకసారి మాత్రమే చైతన్యను కలిసేదాన్నని తెలిపారు. ఇద్దరి వృత్తిగత జీవితాలను సమన్వయం చేసుకోవడం తొలినాళ్లలో సవాల్‌గా అనిపించినప్పటికీ, గత కొన్ని నెలలుగా తమ కొత్త జీవితానికి క్రమంగా అలవాటు పడుతున్నామని చెప్పారు. తమ బంధాన్ని మరింత బలంగా ఉంచేందుకు అవసరమైన విషయాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు శోభిత పేర్కొన్నారు.
తన వివాహం సంప్రదాయ పద్ధతిలో జరగాలని చిన్నప్పటి నుంచి కలలు కనేదాన్నని శోభిత తెలిపారు. తన సొంత రాష్ట్రానికి చెందిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని అనుకున్నానని, ఒక నటుడికి భార్య అవుతానని మాత్రం ఎప్పుడూ ఊహించలేదని చెప్పారు. అలాగే కెరీర్ ప్రారంభంలో ఎక్కువగా ఇండీ చిత్రాల్లో నటించానని, అప్పట్లో ప్రముఖ నటీనటులకే కమర్షియల్ బ్రాండ్లు ప్రాధాన్యత ఇచ్చేవని గుర్తుచేసుకున్నారు. అయితే విభిన్నమైన పాత్రలు చేస్తూ గుర్తింపు పొందిన తర్వాత బ్రాండ్లు తనను సంప్రదించడం ప్రారంభించాయని, ఎవరి కోసం తనను తాను మార్చుకోవాల్సిన అవసరం లేదని అప్పుడే అర్థమైందని చెప్పారు. ఈ ఏడాది ‘చీకటిలో’ వెబ్ సిరీస్‌లో క్రైమ్ పాడ్‌కాస్టర్‌గా కనిపించిన శోభిత.. త్వరలో పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వెట్టువం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!