

‘సరస్వతి’ సినిమా కథపై రచయిత బుర్రా సాయిమాధవ్ చేసిన వ్యాఖ్యలను నటి, దర్శక నిర్మాత వరలక్ష్మీ శరత్‌కుమార్ ఖండించారు. ఆయన ఇచ్చిన కథలోని లైన్‌ను మాత్రమే తీసుకుని, మిగతా కథను తానే కొత్తగా రాసి స్క్రీన్‌ప్లే రూపొందించానని తెలిపారు. అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తర్వాతే కథను తీసుకున్నామని, అయినప్పటికీ గౌరవార్థం సినిమాలో ఆయన పేరును కూడా క్రెడిట్‌గా ఇచ్చామని చెప్పారు. వరలక్ష్మీ ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఆమె తన సోదరి పూజా శరత్‌కుమార్‌తో కలిసి నిర్మించారు.
ఇటీవల సినిమా విడుదలైన సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన థాంక్యూ మీట్లో వరలక్ష్మీ మాట్లాడుతూ.. సాయిమాధవ్ రాసిన కథలో ల్యాగ్ ఉందని చాలామంది సూచించారని, క్లైమాక్స్ మార్చాలని ముందుగానే చెప్పానని తెలిపారు. అయితే ఆయన ఇతర పెద్ద ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల స్టోరీ సిట్టింగ్స్‌కు కూడా అందుబాటులో లేరని చెప్పారు. దీంతో ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని కథలో, ముఖ్యంగా క్లైమాక్స్‌లో మార్పులు చేశానని వివరించారు. అయినప్పటికీ కథ క్రెడిట్‌ను ఆయనకే ఇచ్చామని, అయినా తాను కథను దొంగిలించానని ఆరోపించడం సరికాదన్నారు. ‘సరస్వతి’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడం ఆనందంగా ఉందని, ముఖ్యంగా క్లైమాక్స్ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారని వరలక్ష్మీ తెలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!