

కేజీఎఫ్, కాంతార వంటి భారీ విజయాలను అందించిన హోంబలే ఫిల్మ్స్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. ట్రాన్స్‌సెండెంటల్ ఫిల్మ్స్‌తో కలిసి ‘శరణాగతి – ది లైఫ్ ఆఫ్ ఏ సరెండర్డ్ సోల్’ పేరుతో యానిమేటెడ్ చిత్రాన్ని నిర్మించనున్నట్లు వెల్లడించింది. ఇస్కాన్ వ్యవస్థాపకుడు ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాద జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించనున్నారు. ఆయన ఆధ్యాత్మిక ప్రయాణం, జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలు, ప్రపంచవ్యాప్తంగా భక్తి మార్గాన్ని విస్తరించేందుకు చేసిన కృషిని ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు.
భారతీయ ఆధ్యాత్మికత, సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని అత్యాధునిక ఏఐ మోషన్ క్యాప్చర్ సాంకేతికతతో తెరకెక్కించనున్నారు. భారతీయ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంలో ప్రభుపాద చేసిన విశేష కృషిని ఇందులో చూపించనున్నారు. ఈ సినిమాను 2027 ఆగస్టులో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. కేజీఎఫ్, కాంతార వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత హోంబలే ఫిల్మ్స్ నుంచి వస్తున్న ఈ విభిన్నమైన ప్రాజెక్ట్‌పై సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!