

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి ‘90s’ వెబ్ సిరీస్‌తో గుర్తింపు పొందిన ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించారు. ఈ వేడుకకు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విజయ్ మాట్లాడుతూ.. ఆనంద్ సినిమాల ఎంపిక పట్ల తనకు ఎంతో గర్వంగా ఉందని, ‘ఎపిక్’ అతడి ఫిల్మోగ్రఫీలో ఒక అందమైన చిత్రంగా నిలుస్తుందని అన్నారు. తెలుగు సినిమా ప్రస్తుతం మంచి దశలో ఉందని, ‘ఎపిక్’తో వరుస విజయాల పరంపర కొనసాగాలని ఆకాంక్షించారు. సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. ఆనంద్‌కు సినిమాలపై ఉన్న ఆసక్తిని తాను ఎప్పటి నుంచో గమనిస్తున్నానని, ఏ పాత్రలోనైనా అతడు సహజంగా ఒదిగిపోతాడని ప్రశంసించారు. ఆదిత్య హాసన్ రచన ఎంతో బాగుందని, అనుభవజ్ఞుడైన రచయిత రాసినట్లుగా అనిపించిందని పేర్కొంటూ సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.
ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘ఎపిక్’ 23 నుంచి 26 ఏళ్ల వయసులోని యువత ఎదుర్కొనే ప్రేమ, కుటుంబం, బాధ్యతలకు సంబంధించిన భావోద్వేగాలను ప్రతిబింబించే కథ అని అన్నారు. సహజమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రతి ఒక్కరూ తమను తాము చూసుకుంటారని చెప్పారు. వైష్ణవి చైతన్య మాట్లాడుతూ.. కడలి అనే పాత్రలో నటించానని, తన పాత్ర ద్వారా ఆత్మవిశ్వాసం, ధైర్యం వంటి అంశాలను నేర్చుకున్నానని తెలిపారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. అబ్బాయి, అమ్మాయి మధ్య బంధాన్ని ఎంతో సహజంగా, స్వచ్ఛంగా చూపించిన చిత్రమిదని, కుటుంబ సభ్యులతో కలిసి చూసి ఆస్వాదించవచ్చని అన్నారు. దర్శకుడు ఆదిత్య హాసన్ మాట్లాడుతూ.. ప్రేక్షకులు తనపై ఉంచిన నమ్మకాన్ని ‘ఎపిక్’తో నిలబెట్టుకుంటానని తెలిపారు. నటుడు శివాజీ, సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ తదితరులు కూడా చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!