

రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘రామాయణ: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్’ విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలు నెలకొల్పుతోంది. నవంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్‌లో మంచి స్పందన లభిస్తోంది. నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పౌరాణిక చిత్రంలో సాయి పల్లవి, యశ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ ఇప్పటికే ప్రీ సేల్స్‌లో రూ.35 కోట్ల గ్రాస్ వసూళ్లను దాటినట్లు సమాచారం. ముఖ్యంగా కర్ణాటకలో యశ్‌కు ఉన్న క్రేజ్ కారణంగా అక్కడి నుంచి అత్యధిక బుకింగ్స్ నమోదవుతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్ 2’ పేరిట ఉన్న ప్రీ సేల్స్ రికార్డుపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం పెయిడ్ ప్రివ్యూల ద్వారా రూ.47.90 కోట్లు, తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ.40.30 కోట్లు సాధించి, మొత్తం రూ.88.20 కోట్ల ప్రీ సేల్స్ నమోదు చేసినట్లు సమాచారం. అయితే ‘రామాయణ’కు పెయిడ్ ప్రివ్యూలు లేకపోవడంతో ఈ రెండు చిత్రాల వసూళ్లను నేరుగా పోల్చడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్స్‌లో ‘ధురంధర్ 2’ను అధిగమించేందుకు ‘రామాయణ’కు మరో రూ.5 కోట్లు అవసరమని తెలుస్తోంది. విడుదలకు ముందు మిగిలిన సమయంలో ఈ రికార్డును అందుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!