

మురళీధర్ గౌడ్, సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ‘పళ్ళ బురుసు’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు పవన్ సి. సంగీతం అందించారు. తాజాగా ఈ చిత్రంపై ఓ బాలీవుడ్ స్టార్ దర్శకుడు ప్రశంసలు కురిపించారు. సినిమాలో కామెడీ, సెంటిమెంట్ అంశాలను దర్శకుడు సమతూకంగా తెరకెక్కించారని, ఈ రెండు అంశాలను అద్భుతంగా మేళవించడంలో ఆయన విజయం సాధించారని అన్నారు. సినిమాలోని పలు సన్నివేశాలు తనను ఆకట్టుకున్నాయని ప్రశంసిస్తూ.. చిత్రానికి ఏకంగా 5 రేటింగ్ ఇచ్చారు.
బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శకుడి నుంచి లభించిన ఈ ప్రశంసలు సినిమాకు మరింత ప్రచారం తీసుకురావచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ‘పళ్ళ బురుసు’ కథ విషయానికి వస్తే.. తనకు పళ్లు తోముకోవడానికి పళ్ళ బురుసు కొనివ్వలేదని ఓ తండ్రి తన కుమారుడిపై కేసు వేస్తాడు. ఆ తర్వాత చోటుచేసుకునే పరిణామాలు, కథలో వచ్చే మలుపులను కామెడీ, సెంటిమెంట్ అంశాలతో ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఈ వినూత్న కథాంశం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!