

హీరో, హీరోయిన్లు వివిధ భాషల్లో సినిమాలు చేస్తూ ఆ భాషల్లోని భావోద్వేగాలను అర్థం చేసుకోవడానికి, సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడానికి కొత్త భాషలను నేర్చుకుంటుంటారు. తాజాగా నటి భాగ్యశ్రీ బోర్సే తమిళం నేర్చుకుంటున్నారు. రవితేజ హీరోగా నటించిన ‘మిస్టర్ బచ్చన్’ (2024) సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టిన ఆమె, తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘కింగ్డమ్’, ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ వంటి తెలుగు చిత్రాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇప్పుడు దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి కీలక పాత్రలు పోషించిన ‘కాంత’ సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించింది. ప్రస్తుతం అఖిల్ సరసన ‘లెనిన్’ సినిమాలో నటిస్తోన్న భాగ్యశ్రీ, శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కుతున్న ‘సెయాన్’ సినిమాలో కూడా అవకాశం దక్కించుకుంది. ఈ సినిమా షూటింగ్ సోమవారం ప్రారంభమైంది. తన పాత్రకు ఎంతో ప్రాధాన్యం ఉందని, నటిగా తనను నిరూపించుకునే అవకాశం ఉందని ఆమె తెలిపింది. ప్రేక్షకుల పట్ల నిజాయితీగా ఉండాలంటే భాష నేర్చుకోవడం అవసరమని, ‘కింగ్డమ్’ సినిమాకు తానే డబ్బింగ్ చెప్పానని, ఇప్పుడు ‘సెయాన్’ కోసం తమిళం నేర్చుకుంటున్నానని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!