

భారతీయ సినీ ప్రపంచంలో అత్యంత విజయవంతమైన క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంచైజీల్లో ‘దృశ్యం’ ఒకటి. మలయాళంలో ప్రారంభమైన ఈ కథ తెలుగు, హిందీ భాషల్లోనూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. మొదటి రెండు భాగాలకు లభించిన అద్భుతమైన స్పందనతో మూడో భాగం ‘దృశ్యం 3’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. హిందీ వెర్షన్‌లో అజయ్ దేవగణ్ మరోసారి విజయ్ సల్గాంకర్ పాత్రలో కనిపించనున్నారు. అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో టబు, శ్రియా శరణ్, జైదీప్ అహ్లావత్, ప్రకాశ్ రాజ్, రజత్ కపూర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
కుటుంబాన్ని పోలీసుల నుంచి కాపాడుకోవడానికి ఓ సాధారణ తండ్రి చేసే చివరి, అత్యంత తెలివైన పోరాటం చుట్టూ ఈ కథ సాగనున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. తాజాగా అజయ్ దేవగణ్ సోషల్ మీడియా ద్వారా సినిమా విడుదల తేదీని వెల్లడించారు. తన కుటుంబమే తనకు సర్వస్వమని పేర్కొంటూ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘దృశ్యం 3’ను అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో విజయ్ సల్గాంకర్ చివరి పోరాటం ఎలా ఉండబోతుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో మరింత పెరిగింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!