

అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్న హైదరాబాద్‌కు చెందిన తెలుగు యువకుడు సాయిప్రదీప్ (దీపు) టెక్సాస్‌లో మృతి చెందారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. హైదరాబాద్ దమ్మాయిగూడలోని శ్రీనివాసనగర్ కాలనీకి చెందిన కృష్ణ, విజయలక్ష్మి దంపతుల కుమారుడైన సాయిప్రదీప్ 2024లో అమెరికా వెళ్లారు. టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియోలో తన సోదరుడితో కలిసి ఉంటూ అండర్సన్ యూనివర్సిటీ ఆఫ్ బిజినెస్‌లో ఇటీవలే మాస్టర్స్ పూర్తి చేశారు. అనంతరం సుమారు నాలుగు నెలలుగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు.
సున్నిత మనస్తత్వం కలిగిన సాయిప్రదీప్‌కు సరైన ఉద్యోగం లభించకపోవడంతో మానసిక ఒత్తిడికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో ఆగస్టు 21న తన గదిలో ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన సోదరుడు సాయిప్రణీత్ వెల్లడించారు. మృతదేహాన్ని హైదరాబాద్‌కు తీసుకురావడానికి అయ్యే ఖర్చుల కోసం కుటుంబ సభ్యులు సామాజిక మాధ్యమాల ద్వారా విరాళాలు కోరుతున్నారు. విదేశాల్లో చదువులు పూర్తిచేసి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత ఎదుర్కొంటున్న ఒత్తిళ్లపై ఈ ఘటన మరోసారి ఆందోళన కలిగిస్తోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!