

అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘రాకా’పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో కొనసాగుతున్నట్లు సమాచారం. అక్కడి షెడ్యూల్ పూర్తయిన తర్వాత హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా నిర్మిస్తున్న భారీ సెట్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. ముఖ్యంగా సినిమాలోని ఇంటర్వెల్ సన్నివేశాన్ని ఈ సెట్‌లో తెరకెక్కించేందుకు చిత్రబృందం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీనితో పాటు కొన్ని భారీ యాక్షన్ సన్నివేశాలను కూడా అదే సెట్‌లో చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఈ యాక్షన్ సన్నివేశాల్లో అల్లు అర్జున్ ప్రధానంగా కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది.
ఈ చిత్రంలో దీపికా పడుకోణెతో పాటు మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మాఫియా నేపథ్యంలో ఓ డాన్ చుట్టూ కథ సాగుతుందని సమాచారం. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌ను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. అట్లీతో అల్లు అర్జున్ తొలిసారి కలిసి పనిచేస్తుండటంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా నుంచి రాబోయే ప్రతి అప్‌డేట్ అభిమానుల్లో హైప్‌ను పెంచుతోంది. విడుదలపై స్పష్టత రావాల్సి ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!