

పాన్ ఇండియా స్టార్ యశ్ హీరోగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ చిత్రం ‘టాక్సిక్’. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తన సినీ ప్రయాణంతో పాటు యశ్‌తో తన అనుబంధం, సినిమాపై వచ్చిన విమర్శల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తనపై ఎవరూ నమ్మకం పెట్టుకోని సమయంలో యశ్ మాత్రం తనను పూర్తిగా నమ్మాడని ఆమె తెలిపారు.
బాలనటిగా కెరీర్ ప్రారంభించిన గీతూ.. ఆ తర్వాత నటిగా, దర్శకురాలిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘లయర్స్ డైస్’ రెండు జాతీయ అవార్డులను గెలుచుకోవడంతో పాటు 87వ అకాడమీ అవార్డుల్లో ఉత్తమ విదేశీ భాషా చిత్రం విభాగంలో భారత్ తరఫున అధికారిక ఎంట్రీగా నిలిచింది. అనంతరం తెరకెక్కించిన ‘మూతూన్’ కూడా అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. తనకు ఇన్ని అవార్డులు వస్తాయని దర్శకురాలిగా మారినప్పుడు ఊహించలేదని గీతూ తెలిపారు.
కేరళలో జన్మించిన గీతూ మోహన్‌దాస్ అసలు పేరు గాయత్రీ దాస్. మలేషియా, కెనడాలో పెరిగిన ఆమె ఐదేళ్ల వయసులో మోహన్‌లాల్ నటించిన ‘ఒన్ను ముతల్ పూజ్యం వారే’ చిత్రంతో బాలనటిగా మలయాళ చిత్రసీమలోకి అడుగుపెట్టారు. ఆ చిత్రానికి ఉత్తమ బాలనటిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు అందుకున్నారు. అనంతరం తమిళ, మలయాళ చిత్రాల్లో నటించిన ఆమె 2009లో నటనకు విరామం ఇచ్చి దర్శకత్వం వైపు అడుగులు వేశారు. ఆమె రూపొందించిన లఘుచిత్రం అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ రోటర్‌డామ్‌లో ప్రదర్శితమై పలు అవార్డులు సాధించింది. అంతేకాదు, ఆ లఘుచిత్రాన్ని కేరళలో 12వ తరగతి పాఠ్యపుస్తకంలో పాఠ్యాంశంగా చేర్చారు.
సినిమాటోగ్రాఫర్ రాజీవ్ రవితో పరిచయం కూడా తన సినీ ప్రయాణంలో కీలకంగా మారిందని గీతూ చెప్పారు. కలిసి పనిచేసే సమయంలో ఏర్పడిన స్నేహం 12 ఏళ్ల తర్వాత వివాహ బంధంగా మారింది. 2009లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. వారికి ఆరాధన అనే కుమార్తె ఉంది. పెళ్లి తర్వాత సినిమాలకు కొంతకాలం విరామం తీసుకున్న సమయంలో భర్త రాజీవ్ రవి నుంచి దర్శకత్వానికి సంబంధించిన ఎన్నో విషయాలు నేర్చుకున్నానని గీతూ తెలిపారు.
‘టాక్సిక్’లో యశ్ పాత్రకు సంబంధించిన గ్లింప్స్ విడుదలైన సమయంలో తనపై తీవ్ర విమర్శలు వచ్చాయని గీతూ వెల్లడించారు. ముఖ్యంగా సినిమాలోని ఇంటిమేట్ సన్నివేశాలపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేశారని చెప్పారు. మహిళా దర్శకురాలు కావడం వల్లే తనపై ఆ విమర్శలు మరింతగా వచ్చాయని భావిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. మహిళల స్వేచ్ఛ, సమ్మతి, ఆనందం వంటి అంశాలపై సమాజంలో ఇప్పటికీ చర్చ కొనసాగుతూనే ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.
యశ్ తనకు కేవలం స్టార్, నిర్మాత, నటుడు, సహ రచయిత మాత్రమే కాదని.. ఒక డీప్ ఎమోషన్ అని గీతూ మోహన్‌దాస్ పేర్కొన్నారు. ‘టాక్సిక్’ వంటి భారీ చిత్రాన్ని తాను పూర్తి చేయలేనని చాలామంది యశ్‌తో చెప్పినప్పటికీ, ఆయన మాత్రం తన ప్రతిభపై నమ్మకం ఉంచారని తెలిపారు. నాలుగేళ్లకు పైగా తనతో కలిసి ప్రయాణిస్తూ సినిమా పూర్తయ్యే వరకు అండగా నిలిచిన యశ్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటానని గీతూ చెప్పారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!