

దక్షిణ అట్లాంటిక్ సముద్రంలో ప్రయాణిస్తున్న ఎంవీ హోండియస్ అనే విలాసవంతమైన క్రూజ్ నౌకలో ఒక ప్రమాదకరమైన వైరస్ వ్యాప్తి కలకలం రేపింది. అర్జెంటీనాలోని ఉషువాయా నుంచి అంటార్కిటికా వైపు వెళ్తున్న ఈ నౌకలో సుమారు 150 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. ఏప్రిల్ మధ్యలో ఒకరికి జ్వరం, శ్వాస సమస్యలు రావడంతో మొదలైన ఈ పరిస్థితి, కొద్ది రోజుల్లో మరికొందరికి కూడా వ్యాపించింది. పరిస్థితి తీవ్రంగా మారి ముగ్గురు మరణించగా, కొందరిని చికిత్స కోసం దక్షిణాఫ్రికాకు తరలించారు. పరీక్షల్లో ఇది హంటా వైరస్ పల్మనరీ సిండ్రోమ్ అని, అది కూడా ఆండీస్ వైరస్ అనే ప్రమాదకరమైన రకం వల్ల వచ్చిందని తేలింది. ఈ వైరస్ అరుదుగా మనిషి నుంచి మనిషికి కూడా వ్యాపించగలదు. దీంతో నౌకను కేప్ వెర్డ్ దగ్గర క్వారంటైన్లో ఉంచారు. ఇదిలా ఉండగా, కొంతమంది ప్రయాణికులు ఇప్పటికే ఇతర దేశాలకు వెళ్లినట్లు తెలిసింది.
అమెరికా, బ్రిటన్, స్విట్జర్లాండ్, జర్మనీ, దక్షిణాఫ్రికా దేశాల్లో అనుమానిత కేసులు కనిపించడంతో అధికారులు ట్రేసింగ్ ప్రారంభించారు. ఈ వైరస్ సాధారణంగా ఎలుకల ద్వారా వ్యాపించి, ఊపిరితిత్తులకు తీవ్రమైన నష్టం కలిగిస్తుంది. దీనికి ప్రత్యేకమైన మందు లేదా వ్యాక్సిన్ ఇప్పటివరకు లేదు. అందుకే రోగులకు పరిస్థితి బట్టి ఆక్సిజన్, ఐసీయూ వంటి చికిత్సలు అందిస్తున్నారు. ఇద్దరు భారతీయుల గురించి కూడా ఆందోళన వ్యక్తమవుతున్నప్పటికీ, వారు ఎక్కడ ఉన్నారన్నది ఇంకా తెలియలేదు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వైరస్ కోవిడ్‌లాంటి పెద్ద మహమ్మారి కాదని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని తెలిపింది.
గమనిక: ఇది సాధారణ సమాచారం మాత్రమే. వ్యక్తిగత సలహా కోసం నిపుణులను సంప్రదించాలి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!