

దేశ సరిహద్దుల్లో క్లిష్ట పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తూ మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణా, మానవ అక్రమ రవాణా, అక్రమ వలసలు, నకిలీ కరెన్సీ, వన్యప్రాణులకు సంబంధించిన నేరాలు, ఇతర వ్యవస్థీకృత నేరాలను సమర్థవంతంగా అడ్డుకోవడంలో సశస్త్ర సీమా బల్ (SSB) కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ, అధునాతన పద్ధతులతో సరిహద్దు నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తున్న ఎస్‌ఎస్‌బీ సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని ఎస్‌ఎస్‌బీ ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన 48 ప్రత్యేక కుటుంబ నివాస గృహాలను బండి సంజయ్ ప్రారంభించారు. అనంతరం అధికారులతో కలిసి నూతన గృహ సముదాయాలను పరిశీలించి, జవాన్లకు అందుతున్న సౌకర్యాలు, సంక్షేమ కార్యక్రమాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సరిహద్దుల్లో దేశ భద్రత కోసం పనిచేసే జవాన్ల కుటుంబాలు సురక్షితంగా, గౌరవంగా, సౌకర్యవంతంగా జీవించేలా చూడటం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. కుటుంబ సంక్షేమంపై ఆందోళన లేకపోతే జవాన్లు దేశ భద్రత, సేవపై మరింత దృష్టి పెట్టగలరని పేర్కొన్నారు. ఈ 48 నివాస గృహాలు కేంద్ర సాయుధ పోలీసు బలగాల సిబ్బంది సంక్షేమానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు ప్రతీకలని తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!