

హిందూ ధర్మం, నినాదాల దుర్వినియోగంపై ఇటీవల నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఈ నేపథ్యంలో బీజేపీ మహిళా కార్యకర్తలు అనసూయ ఫ్లెక్సీలను చించివేసినట్లు సమాచారం. దీంతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో ఆమె వ్యాఖ్యలపై విమర్శలు, ట్రోలింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో అనసూయ స్పందిస్తూ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో సుదీర్ఘమైన వివరణను పంచుకున్నారు.
తన వ్యాఖ్యలను కొందరు కావాలనే వక్రీకరిస్తున్నారని అనసూయ పేర్కొన్నారు. తనపై అసభ్యకర వ్యాఖ్యలు, వ్యక్తిగత దాడులు, బెదిరింపులకు పాల్పడుతున్న కొంతమంది వ్యక్తుల గురించే తాను మాట్లాడానని, ఏ మతాన్ని లేదా వర్గాన్ని కించపరచడం తన ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. తాను సనాతన ధర్మాన్ని పాటించే హిందువునని, హనుమంతుడి భక్తురాలినని తెలిపారు. నిజం వైపు నిలబడటం, తప్పును ప్రశ్నించడం, ప్రతి ఒక్కరినీ గౌరవించడం తన ధర్మం నేర్పిన విలువలని చెప్పారు. తన వ్యాఖ్యల నుంచి సందర్భాన్ని తొలగించి తప్పుడు ప్రచారం చేయవద్దని, ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు లేదా సగం సగం కథనాలను నమ్మకుండా పూర్తి విషయాన్ని తెలుసుకున్న తర్వాతే అభిప్రాయానికి రావాలని నెటిజన్లను కోరారు. “జై శ్రీరామ్, జై హనుమాన్” అంటూ ఆమె చేసిన ఈ క్లారిఫికేషన్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!