

2027 జనాభా లెక్కల్లో ఇతర వెనుకబడిన తరగతులు (OBC), సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతులు (SEBC) జనాభాను శాస్త్రీయంగా, పారదర్శకంగా నమోదు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఈ మేరకు ప్రధానికి రాసిన లేఖలో పలు కీలక సూచనలు చేశారు. రిజర్వేషన్లు, విద్య, ఉపాధి, సంక్షేమం, సమాన ప్రాతినిధ్యం వంటి విధానాలను సమర్థవంతంగా అమలు చేయాలంటే విశ్వసనీయమైన కులవారీ, సామాజిక-ఆర్థిక సమాచారం అవసరమని పేర్కొన్నారు. 2027 జనాభా లెక్కలను కేంద్రం అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో ఈ సూచనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
SC, STలకు ఉన్నట్లుగానే OBC, SEBCలకు జనాభా లెక్కల ప్రశ్నావళిలో ప్రత్యేక కేటగిరీ ఏర్పాటు చేయాలని పొన్నం ప్రభాకర్ సూచించారు. రాష్ట్రాల వారీగా మాస్టర్ కుల డైరెక్టరీ రూపొందించడం, ప్రతి కులం లేదా సముదాయానికి ప్రత్యేక డిజిటల్ కోడ్ కేటాయించడం, జాబితాలో లేని లేదా వివాదాస్పదమైన కులపేర్లను నమోదు చేసి ధ్రువీకరించే విధానం ఏర్పాటు చేయాలని కోరారు. 2011 సామాజిక-ఆర్థిక, కుల గణనలో ఓపెన్-ఎండెడ్ విధానంతో కులపేర్ల నమోదులో ఎదురైన సమస్యలు పునరావృతం కాకుండా ప్రమాణీకృత విధానం అవలంబించాలని సూచించారు. తెలంగాణలో నిర్వహించిన SEEEPC సర్వే ద్వారా లభించిన ఇంటింటి స్థాయి డేటా సేకరణ, కుల సమాచార నమోదు అనుభవాన్ని జాతీయ స్థాయిలో 2027 జనాభా లెక్కల రూపకల్పనలో పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోరారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!