

కళ్ల కింద వాపు కనిపించడం కేవలం అలసట లేదా నిద్రలేమి కారణంగానే కాకుండా, కిడ్నీ పనితీరుతో కూడా సంబంధం ఉండొచ్చు. మన శరీరంలో రక్తాన్ని వడపోసి, వ్యర్థాలు మరియు అదనపు ద్రవాలను బయటకు పంపే ప్రధాన అవయవాలు మూత్రపిండాలు. కిడ్నీలలోని ఫిల్టర్లు దెబ్బతిన్నప్పుడు శరీరానికి అవసరమైన అల్బుమిన్ వంటి ప్రోటీన్లు మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి. దీంతో రక్తంలో ప్రోటీన్ స్థాయిలు తగ్గి, రక్తనాళాలు ద్రవాన్ని నిలుపుకునే సామర్థ్యం కోల్పోతాయి. ఫలితంగా నీరు బయటకు లీక్ అయి కళ్ల కింద ఉన్న మృదువైన కణజాలాల్లో చేరి వాపు కలిగిస్తుంది. రాత్రంతా ఒకే భంగిమలో నిద్రపోవడం వల్ల ఉదయం ఈ వాపు మరింత స్పష్టంగా కనిపించవచ్చు.
ఇలాంటి లక్షణాలు తరచుగా కనిపిస్తే కిడ్నీల ఆరోగ్యాన్ని తెలుసుకునేందుకు వైద్యులు సాధారణంగా రెండు పరీక్షలు సూచిస్తారు. మూత్ర పరీక్ష ద్వారా ప్రోటీన్ లీకేజీ ఉందో లేదో తెలుసుకోవచ్చు. క్రియేటినిన్ రక్త పరీక్ష ద్వారా కిడ్నీలు రక్తాన్ని ఎంత సమర్థవంతంగా శుద్ధి చేస్తున్నాయో అంచనా వేయవచ్చు. ప్రారంభ దశలో సమస్యను గుర్తిస్తే కాళ్లు, పాదాల్లో వాపు వంటి తీవ్రమైన సమస్యలను నివారించవచ్చు. ముఖ్యంగా మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. రక్తపోటు, చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడం, ఆహారంలో ఉప్పు తగ్గించడం, తీపి పదార్థాలకు దూరంగా ఉండడం కిడ్నీల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. శరీరంలో కనిపించే చిన్న మార్పులను కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుల సలహా తీసుకోవడం అవసరం.
గమనిక : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!