

తెలుగు రాష్ట్రాల్లో పండుగలు, ప్రత్యేక సందర్భాలు వచ్చాయంటే బొబ్బట్లకు ప్రత్యేక స్థానం ఉంటుంది. శనగపప్పు, బెల్లం పూర్ణంతో తయారుచేసే ఈ సంప్రదాయ వంటకం చిన్నా, పెద్దా అందరికీ ఎంతో ఇష్టం. ఇంట్లోనే మృదువైన, రుచికరమైన బొబ్బట్లు తయారుచేసుకోవాలంటే ముందుగా పిండి సిద్ధం చేసుకోవాలి. ఇందుకోసం ఒక కప్పు గోధుమపిండి, ఒక కప్పు మైదా, కొద్దిగా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కలపాలి. కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ చేతికి అంటుకునేలా పిండిని కలిపి, మరో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా మర్దించాలి. పైన కొద్దిగా నెయ్యి రాసి మూతపెట్టి కనీసం గంటసేపు నానబెట్టాలి. అనంతరం ఒక కప్పు పచ్చిశనగపప్పును శుభ్రంగా కడిగి గంటపాటు నానబెట్టి, రెండు కప్పుల నీటితో ప్రెషర్ కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. నీటిని పూర్తిగా వడకట్టిన తర్వాత పప్పును మెత్తగా మెదపాలి.
మెదిపిన శనగపప్పులో ఒక కప్పు తురిమిన బెల్లం కలిపి మీడియం మంటపై ఉడికించాలి. బెల్లం కరిగి మిశ్రమం చిక్కబడే వరకు అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఈ పూర్ణం చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన పిండి నుంచి చిన్న ముద్ద తీసుకుని, మధ్యలో పూర్ణం ఉండ పెట్టి అన్ని వైపులా మూసేయాలి. బటర్ పేపర్‌పై కొద్దిగా నెయ్యి రాసి, పూర్ణం బయటకు రాకుండా నెమ్మదిగా పల్చగా వత్తుకోవాలి. అనంతరం వేడిచేసిన పెనంపై బొబ్బట్టును వేసి, రెండు వైపులా నెయ్యి రాస్తూ మీడియం మంటపై బంగారు రంగు వచ్చే వరకు కాల్చాలి. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే బయట కొనుగోలు చేసినట్లుగానే మెత్తగా, రుచిగా ఉండే సంప్రదాయ బొబ్బట్లను ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోవచ్చు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!