

గుండె రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా ఉండాలంటే ఆహారంలో పీచు పదార్థం అధికంగా ఉండాలి. పొట్టు తీయని గోధుమ పిండితో చేసే రోటీలో పీచు పదార్థం సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను పీల్చుకుని బయటకు పంపడంలో సహాయపడుతుంది. పాలిష్ చేసిన తెల్ల బియ్యంలో పీచు దాదాపు ఉండదు, ఇది కేవలం పిండి పదార్థంగా మారి శరీరంలో కొవ్వు నిల్వలు పెరగడానికి కారణమవుతుంది. బ్రౌన్ రైస్‌ను ప్రత్యామ్నాయంగా వాడితే కొంతమేర పీచు లభిస్తుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ అనే కొలమానం ప్రకారం బియ్యం రక్తంలో చక్కెరను వేగంగా పెంచుతుంది, దీనివల్ల ఇన్సులిన్ స్థాయిలు ఒక్కసారిగా పెరిగి గుండె సంబంధిత వ్యాధుల ముప్పు పెరుగుతుంది. రోటీకి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటంతో శక్తిని నెమ్మదిగా విడుదల చేస్తుంది, గుండెపై ఒత్తిడి తగ్గించి రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. అలాగే గోధుమలలో మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉండటం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉండి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
అయితే రోటీ తయారీలో ఎక్కువ ఉప్పు వేయడం హానికరం, ముఖ్యంగా హై బీపీ లేదా గుండె సమస్యలున్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఉప్పు లేకుండా చేసే రోటీ ఆరోగ్యానికి మంచిది. అధిక బరువు గుండెపై ఒత్తిడిని పెంచుతుంది. అన్నం త్వరగా అరిగిపోవడంతో మళ్లీ ఆకలి వేయించి ఎక్కువ కేలరీలు తీసుకునేలా చేస్తుంది, కానీ రోటీలోని సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు ఎక్కువసేపు తృప్తిని ఇస్తాయి. జొన్నలు, సజ్జలు, రాగులు, ఓట్స్ వంటి ధాన్యాలతో రోటీలు చేసుకోవడం మరింత పోషకాలను అందిస్తుంది. అన్నం పూర్తిగా మానలేకపోతే బ్రౌన్ రైస్ వాడడం, కూరగాయలు కలిపి వండటం మంచిది. మీరు ఏది తిన్నా, మీ ప్లేట్లో సగం భాగం ఆకుకూరలు, కూరగాయలు, పప్పులతో నింపడం ద్వారా సమతుల ఆహారం తీసుకోవచ్చు.
గమనిక: ఇది సాధారణ సమాచారం మాత్రమే. వ్యక్తిగత సలహా కోసం నిపుణులను సంప్రదించాలి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!