

న్యూజిలాండ్‌తో మూడో వన్డే కోసం టీమిండియా హామిల్టన్‌కు చేరుకుంది. ఈ క్రమంలో భారత స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ తన మంచి మనసుతో అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. రెండో వన్డేలో గేమ్ ఛేంజర్ అవార్డును అందుకున్న రాహుల్‌కు బహుమతిగా స్మార్ట్‌ఫోన్ లభించింది. అయితే ఆ ఫోన్‌ను తన వద్ద ఉంచుకోకుండా ఓ మహిళా అధికారిణికి బహుమతిగా ఇచ్చి ఆమెను ఆశ్చర్యపరిచాడు. అనూహ్యంగా అందిన ఈ కానుకతో తొలుత షాక్‌కు గురైన ఆమె, ఆ తర్వాత ఎంతో సంతోషం వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. ఈ వీడియోలో మహిళా అధికారిణి మాట్లాడుతూ.. కేఎల్ రాహుల్ తనకు స్మార్ట్‌ఫోన్ బహుమతిగా ఇచ్చినప్పుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయానని, ఆయన మంచి మనసుకు ఈ సంఘటనే నిదర్శనమని పేర్కొన్నారు.
ఈ వీడియోకు బీసీసీఐ 'గొప్ప ఆటగాడు.. అంతకంటే గొప్ప మనసు' అనే క్యాప్షన్ జత చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. మైదానంలో తన బ్యాటింగ్‌తో ఆకట్టుకునే రాహుల్, మైదానం వెలుపల కూడా తన ఉదారతతో అభిమానుల మనసులు గెలుచుకుంటున్నాడంటూ పలువురు ప్రశంసిస్తున్నారు. అవార్డుగా వచ్చిన బహుమతిని మరొకరికి ఇచ్చి ఆనందాన్ని పంచుకోవడం అభినందనీయమని కామెంట్లు చేస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!