

టాలీవుడ్‌లో ప్రస్తుతం అత్యంత క్రేజ్ ఉన్న దర్శకుల్లో సందీప్ రెడ్డి వంగ ఒకరు. ఆయనతో స్టార్ హీరో సినిమా అంటే ప్రేక్షకుల్లో సహజంగానే భారీ అంచనాలు ఏర్పడతాయి. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్‌తో స్పిరిట్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత కూడా ఆయనకు వరుసగా క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. అనిమల్ 2, మహేష్‌తో డెవిల్ సినిమాలతో పాటు అల్లు అర్జున్‌తో కూడా ఒక సినిమా చేయాల్సి ఉంది. ఇలా ఇప్పటికే భారీ లైనప్ ఉన్న సందీప్ రెడ్డి వంగ, తన అభిమాన హీరోల్లో ఒకరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయనున్నారనే ప్రచారం మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ కాంబినేషన్‌పై కొంతకాలంగా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. తాజాగా సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్, సందీప్ రెడ్డి వంగ, టీ సిరీస్ కాంబినేషన్‌లో ఓ సినిమా ప్రకటన రాబోతుందనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. అయితే ఈ వార్తకు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధ్రువీకరణ లేదు. సందీప్ రెడ్డి వంగ ఇప్పటికే పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న నేపథ్యంలో పవన్‌తో సినిమా ఎప్పుడు సాధ్యమవుతుందనేది కూడా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం నిజమా, అభిమానుల ఊహాగానాలకే పరిమితమా అనేది సెప్టెంబర్ 2న తేలే అవకాశం ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!