

మెగాస్టార్ చిరంజీవి తన అభిమానులకు మరో సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారనే వార్తలు సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. దశాబ్దాలుగా వెండితెరపై తనదైన మాస్ ఇమేజ్‌తో అలరిస్తున్న చిరంజీవి.. ఇప్పుడు డిజిటల్ వేదికపైకి సరికొత్త ఫార్మాట్‌లో రానున్నట్లు సమాచారం. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ కోసం ఆయన పాడ్‌కాస్ట్ షో చేయనున్నారనే టాక్ ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తోంది. తొలుత చిరంజీవిపై డాక్యుమెంటరీ రూపొందించాలని భావించిన నెట్‌ఫ్లిక్స్.. అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగా పాడ్‌కాస్ట్ ఫార్మాట్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో తన సుదీర్ఘ సినీ ప్రయాణం, వ్యక్తిగత అనుభవాలు, విజయాలు, సవాళ్ల గురించి చిరంజీవి మరింత వ్యక్తిగతంగా, స్వేచ్ఛగా పంచుకోనున్నట్లు సమాచారం.
ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతలను చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత కొణిదెల చేపట్టనున్నట్లు తెలుస్తోంది. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాతగా ఇప్పటికే పలు ప్రాజెక్టులు చేసిన సుష్మిత.. ఇప్పుడు తన తండ్రితో కలిసి ఈ పాడ్‌కాస్ట్‌ను రూపొందించనున్నట్లు సమాచారం. చిరంజీవి సినీ జీవితంలోని అరుదైన జ్ఞాపకాలు, ఇండస్ట్రీ ప్రముఖులతో ఆయన అనుబంధం, కెరీర్‌ను మలుపుతిప్పిన కీలక సంఘటనలు ఈ కార్యక్రమంలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ నుంచి ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!