

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస భారీ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒకవైపు ‘ఫౌజీ’ షూటింగ్లో పాల్గొంటూనే, మరోవైపు ‘స్పిరిట్’, ‘కల్కి 2’ కోసం సిద్ధమవుతున్నారు. ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న ‘స్పిరిట్’ సినిమా ప్రకటన నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ మూవీకి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా విలన్ పాత్రపై ఊహాగానాలు హాట్ టాపిక్‌గా మారాయి.
సినిమా ప్రకటించిన వెంటనే కొరియా యాక్షన్ స్టార్ డాన్ లీ విలన్‌గా కనిపిస్తారనే వార్తలు వినిపించాయి. ‘ది ఔట్‌లాస్’, ‘ట్రైన్ టూ బూసాన్’ సినిమాలతో అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఆయన ‘స్పిరిట్’లో ఉంటే సినిమా గ్లోబల్ రేంజ్‌కు వెళ్తుందనే చర్చ మొదలైంది. అయితే మూవీ టీమ్ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన లేదు. ఇటీవల ఒక ఈవెంట్లో విలన్ గురించి ప్రశ్నించగా, వంగా “మీరు అనుకున్నట్టే జరుగుతుంది” అని చెప్పడం సస్పెన్స్‌ను మరింత పెంచింది.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ‘స్పిరిట్’ ను పాన్ ఇండియా మాత్రమే కాకుండా పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌గా తీర్చిదిద్దాలనే ప్లాన్‌లో వంగా ఉన్నట్టు తెలుస్తోంది. కొరియన్ నటీనటులు, స్టంట్ టీమ్‌ను తీసుకురావాలనే ఆలోచన ఉందని టాక్. ఈ మూవీలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారని సమాచారం. ‘యానిమల్’ తర్వాత వంగా ఈ సినిమాలో ఇంకా ఇంటెన్స్ యాక్షన్ చూపిస్తారనే అంచనాలు ఉన్నాయి. వచ్చే నెల 1 న డాన్ లీ పుట్టినరోజు కావడంతో ఆ రోజున ప్రత్యేక పోస్టర్ లేదా ప్రకటన రావచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!