

న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు సుజీత్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘బ్లడీ రోమియో’ చిత్రంపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ చిత్రీకరణలో కొంత జాప్యం జరుగుతున్న నేపథ్యంలో ‘బ్లడీ రోమియో’ షూటింగ్‌ను అక్టోబర్ నుంచి ప్రారంభించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కథానాయిక ఎంపికపై చర్చ మొదలైంది. యంగ్ అండ్ టాలెంటెడ్ నటి భాగ్యశ్రీ బోర్సేను నాని సరసన కథానాయికగా తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు, త్వరలోనే హీరోయిన్ ఎంపికపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఇటీవల ‘లెనిన్’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న భాగ్యశ్రీ బోర్సేకు టాలీవుడ్‌లో వరుస అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విజయంతో ఆమెకు డిమాండ్ పెరగడంతో పాటు పారితోషికం కూడా పెంచినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పలువురు దర్శకనిర్మాతలు ఆమెను సంప్రదిస్తున్నప్పటికీ.. కథ, పాత్రకు ప్రాధాన్యం ఉన్న చిత్రాలకే ఆమె మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నాని ‘బ్లడీ రోమియో’ ప్రాజెక్ట్‌పై ఆమె ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నాని, భాగ్యశ్రీ బోర్సే జోడీ తెరపై ఎలా ఉంటుందనే ఆసక్తి అభిమానుల్లో ఇప్పటికే మొదలైంది. అయితే కథానాయికగా భాగ్యశ్రీ ఎంపికపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!