

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సెప్టెంబర్ 23 నుంచి 25 వరకు అమెరికాలో పర్యటిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాయింట్ బేస్ ఆండ్రూస్‌లో జిన్‌పింగ్‌కు స్వయంగా స్వాగతం పలకనున్నారు. అనంతరం వైట్‌హౌస్‌లో ఇరు దేశాధినేతల మధ్య అధికారిక చర్చలు జరగనున్నాయి. వాణిజ్య సంబంధాలు, అరుదైన ఖనిజాల సరఫరా, కృత్రిమ మేధస్సు వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. సాంకేతికత, తైవాన్, వ్యూహాత్మక అంశాలపై ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న విభేదాల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదే సమయంలో చైనా నుంచి భారీ స్థాయిలో పారిశ్రామికవేత్తల బృందం రాకపోవడంపై కూడా చర్చ జరుగుతోంది.
మరోవైపు జిన్‌పింగ్‌కు ట్రంప్ ఇవ్వనున్న ఘన స్వాగతంపై అమెరికా రిపబ్లికన్ పార్టీకి చెందిన కొందరు నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. సెనెట్ ఆర్మ్డ్ సర్వీసెస్ కమిటీ ఛైర్మన్ రోజర్ వికెర్.. చైనా సైనిక విస్తరణ, ఇరాన్‌కు చైనా మద్దతు వంటి అంశాలను జిన్‌పింగ్‌తో చర్చించాలని ట్రంప్‌ను కోరారు. జిన్‌పింగ్‌కు ఉన్నత స్థాయి స్వాగతం ఇవ్వడాన్ని కూడా ఆయన ప్రశ్నించారు. అయితే ట్రంప్ ప్రభుత్వం మాత్రం ఈ పర్యటనను ఆర్థిక, వ్యూహాత్మక అంశాలపై చర్చలు జరిపేందుకు, ఇరు దేశాల మధ్య విభేదాలను నిర్వహించేందుకు ఒక అవకాశంగా చూస్తోంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!