

విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులు కీలక దశకు చేరుకున్నాయి. రెండు ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలను కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మదింపునకు పంపింది. తొలి దశలో రెండు నగరాల్లో కలిపి రూ.21,616 కోట్ల అంచనా వ్యయంతో 84.63 కిలోమీటర్ల మేర మెట్రో నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. విశాఖలో స్టీల్‌ప్లాంట్ నుంచి నగరంలోని కీలక ప్రాంతాలకు మెట్రో అనుసంధానం కల్పించనుండగా.. విజయవాడలో గన్నవరం, విమానాశ్రయం, ప్రధాన నివాస, వాణిజ్య ప్రాంతాలను మెట్రో ద్వారా అనుసంధానించనున్నారు.
రెండు ప్రాజెక్టులను సంయుక్త భాగస్వామ్య విధానంలో చేపట్టనున్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చెరో 20 శాతం నిధులు సమకూర్చనుండగా.. మిగిలిన 60 శాతం నిధులను ఆర్థిక సంస్థల ద్వారా సమీకరించనున్నారు. ఇదిలా ఉండగా, విజయవాడ మెట్రో ప్రాజెక్టు కోసం బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, గన్నవరం, పెనమలూరులో సోషల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ సర్వే ప్రారంభమైంది. రెండు కారిడార్లకు సుమారు 80 ఎకరాల భూమి అవసరం కాగా, ఇందులో మెట్రో స్టేషన్లు, కోచ్ డిపో ఏర్పాటు చేయనున్నారు. సర్వే పూర్తైన తర్వాత భూసేకరణ ప్రక్రియకు జిల్లా యంత్రాంగం నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఆర్థిక మదింపు పూర్తై కేంద్రం తుది నిర్ణయం తీసుకుంటే తొలి దశ పనులు ప్రారంభించేందుకు మార్గం సుగమం కానుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!