

కేరళ రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కూటమి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో సోమవారం ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత వీడీ సతీశన్ కేరళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఆయనతో పదవీ ప్రమాణం చేయించారు.
ముఖ్యమంత్రి వీడీ సతీశన్తో పాటు పూర్తి స్థాయి మంత్రివర్గం కూడా ప్రమాణ స్వీకారం చేసింది. ముఖ్యమంత్రితో కలిపి మొత్తం ఇరవై మంది మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం కనిపించింది. ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా సాగింది.
ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖ నేతలు హాజరయ్యారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా హాజరై కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!