

జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజీత్ డోభాల్, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) మాజీ అధినేత సామంత్ గోయెల్‌కు అమెరికాలోని డిస్ట్రిక్ట్ కోర్టు సమన్లు జారీ చేసింది. తన హత్యకు భారత అధికారులు కుట్ర పన్నారని ఆరోపిస్తూ ఖలిస్థానీ వేర్పాటువాది గుర్‌పత్వంత్ సింగ్ పన్నూ దాఖలు చేసిన సివిల్ వ్యాజ్యం విచారణలో భాగంగా ఈ చర్య తీసుకుంది. కోర్టు ఆదేశాల మేరకు సమన్లను దౌత్య మార్గాల ద్వారా వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయానికి పంపినట్లు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. విదేశీ సార్వభౌమత్వ రక్షణల చట్టం (ఎఫ్‌ఎస్‌ఐఏ) నిబంధనల ప్రకారం కోర్టు అభ్యర్థనను అనుసరించి ఈ పత్రాలను భారత ప్రభుత్వానికి పంపినట్లు తెలిపింది. ఈ కేసులోని ఆరోపణలతోనూ, కోర్టు విచారణ ప్రక్రియతోనూ అమెరికా ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.
నిషేధిత సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్ (ఎస్‌జేఎఫ్) తరఫున గుర్‌పత్వంత్ సింగ్ పన్నూ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. తనపై జరిగినట్లు ఆరోపిస్తున్న హత్యాయత్నానికి పరిహారం చెల్లించాలని పిటిషన్‌లో కోరారు. అయితే, డోభాల్, సామంత్ గోయెల్‌పై పన్నూ చేసిన ఆరోపణలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. అవి దురుద్దేశపూరితమైనవి, నిరాధారమైనవని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జయస్వాల్ మంగళవారం దిల్లీలో పేర్కొన్నారు. ఈ అసంబద్ధమైన వ్యాజ్యాన్ని భారత్ తిరస్కరిస్తోందని స్పష్టం చేశారు. విదేశీ న్యాయస్థానాల పత్రాలను భారత్‌లోని సంబంధిత అధికారిక విభాగమైన కేంద్ర న్యాయశాఖ ద్వారానే పంపించాల్సి ఉంటుందని కూడా ఆయన వెల్లడించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!