

పంజాబ్‌లోని ఫగ్వారా లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU)లో సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ సందేశం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఓ విద్యార్థినిపై అత్యాచారం జరిగిందని, అనంతరం ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు ఆ సందేశంలో ప్రచారం జరిగింది. దీంతో ఆదివారం తెల్లవారుజామున బాలికల హాస్టల్ సమీపంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు క్యాంపస్‌లో గుమిగూడగా.. కిటికీలు, పూలకుండీలు తదితర యూనివర్సిటీ ఆస్తులు ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు. కొన్ని వస్తువులకు నిప్పంటించినట్లు కూడా సమాచారం. అనంతరం విద్యార్థులు జలంధర్-ఫగ్వారా జాతీయ రహదారిని దిగ్బంధించడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
అత్యాచారానికి సంబంధించిన ఆరోపణలపై తొలుత తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, వాటిని నిర్ధారించే ఆధారాలు కూడా లభించలేదని పోలీసులు తెలిపారు. అయితే, అనంతరం విద్యార్థుల వాంగ్మూలాల ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నమోదు ప్రక్రియ ప్రారంభించినట్లు కొన్ని నివేదికలు వెల్లడించాయి. ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోంది. యూనివర్సిటీ వ్యవహరించిన తీరుపై కూడా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. మరోవైపు, ధ్రువీకరణ లేని సమాచారాన్ని నమ్మవద్దని, వ్యాప్తి చేయవద్దని యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్థులను కోరింది. ప్రస్తుతం ఆరోపణలతో పాటు ఆందోళనకు దారితీసిన పరిస్థితులపై అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!