

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు పూర్తికావస్తున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్‌లో డీజేలు, పాటల విషయంలో పోలీసులు ఆంక్షలు విధించడాన్ని ఆయన ప్రశ్నించారు. అణిచివేత ఎక్కువైతే సందర్భం వచ్చినప్పుడు గడ్డిపోచలు కూడా గడ్డపారలుగా మారుతాయని వ్యాఖ్యానించారు. ‘ది ప్యారడైజ్’ సినిమాలో కేసీఆర్ పాత్ర కేవలం కొన్ని నిమిషాలే ఉన్నప్పటికీ, ప్రజలు ఆయనను గుర్తు చేసుకునే విధానం కనిపించిందన్నారు. రాష్ట్రంలోని వివిధ వర్గాల్లో నిరాశ, నిస్పృహలు ఉన్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ వ్యవస్థపై ప్రభుత్వం విధానాల ప్రభావంతో పరిస్థితి దెబ్బతిన్నదని, మెట్రో రైలు విస్తరణ, మూసీ ప్రక్షాళన, గృహ నిర్మాణం వంటి అంశాల్లో తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులను ఆయన ప్రస్తావించారు.
మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు భయాందోళనలో ఉన్నారని కేటీఆర్ అన్నారు. రూ.16 వేల కోట్లతో మూసీని అభివృద్ధి చేయాలని, 32 ఎస్టీపీలు ఏర్పాటు చేసి మురుగునీరు మూసీలోకి చేరకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. 58 జీవో కింద రెండు లక్షల మందికి పట్టాలు ఇచ్చామని, డబుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మించామని చెప్పారు. హైడ్రా చర్యలపై ప్రశ్నలు లేవనెత్తుతూ పలువురు కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఎందుకు చర్యలు ఉండవని ప్రశ్నించారు. ఫ్యూచర్ సిటీపై కూడా విమర్శలు చేసిన ఆయన, తమ ప్రభుత్వం చేపట్టిన రాయదుర్గం–శంషాబాద్ మెట్రో టెండర్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు. రెండేళ్లలో కేసీఆర్ తిరిగి వస్తారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా, రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ సెప్టెంబర్ 28 నుంచి ప్రారంభం కానుండటంతో అర్హులైన పట్టభద్రులు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!