

హైదరాబాద్‌లో భారీ నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టయింది. ఫ్యూచర్ సిటీ పోలీసులు నకిలీ నోట్ల తయారీ, చలామణికి పాల్పడుతున్న ముఠాను పట్టుకున్నారు. ఈ ఘటనలో నలుగురు నిందితులను అరెస్టు చేసి, రూ.6.78 కోట్ల విలువైన రూ.500 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్, షాద్‌నగర్ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (SOT) సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. పోలీసుల వివరాల ప్రకారం.. కుంట్లూరులోని ఓ అద్దె ఇంటిని కేంద్రంగా చేసుకుని నిందితులు ఈ అక్రమ కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఫోటోషాప్ సాయంతో నకిలీ కరెన్సీ నోట్లను ముద్రిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
ఈ దాడిలో నకిలీ గుర్తింపు కార్డులు, డమ్మీ పిస్టళ్లు, వాకీటాకీలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులుగా నటిస్తూ అమాయకుల నుంచి అసలు నగదును వసూలు చేసేందుకు నిందితులు ఈ వస్తువులను ఉపయోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, ఐపీఎస్ మీడియాకు కేసు వివరాలను వెల్లడించారు. ఈ ముఠాతో సంబంధం ఉన్న మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. ఈ నకిలీ కరెన్సీ వ్యవహారంలో మరిన్ని వివరాలు వెలుగులోకి తెచ్చేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!